24th Bheemili Ashram Anniversary – December 25th 2025

కృత్రిమ మేధాశక్తితో ఆధ్యాత్మికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు

కృత్రిమ మేధాశక్తితో ఆధ్యాత్మికతను సమన్వయం చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. 25-12-25వ తేదీ గురువారం ఉదయం 9:30 గంటలకు భీమిలి ఆశ్రమం 24వ వార్షికోత్సవ సభ ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా వారి అధ్యక్షతన ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీఠాధిపతి ఉమర్ అలీషా సద్గురువర్యులు అనుగ్రహభాషణ చేస్తూ ఆధునిక విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక తత్వంతో మేళవించుకొని, మానవత్వపు విలువలతో పయనిస్తే ఆనందమయ జీవితాన్ని పొందవచ్చని అన్నారు. మన దైనందిన జీవన విధానంలో ఎన్నో సమస్యలు, క్షణికావేశాలు అరిషడ్వర్గాల వల్ల ఏర్పడి, మన మనసులో తుఫానులా విజృంభించి, అల్లకల్లోలం చేస్తున్న తరుణంలో ఆధ్యాత్మిక తత్వంతో శాంతిని, తృప్తిని పొంది తరించవచ్చు. దాని కోసం ప్రతి ఒక్కరూ త్రయీసాధన మార్గాన్ని అనుసరించాలి. తద్ద్వారా శరీర తత్వానికి భుక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మ తత్వానికి ముక్తి అనే మూడు ప్రసాదాలు లభిస్తాయి. అలాగే సహనంతో, సుఖ సంతోషాలతో జీవించే అవకాశం కలుగుతుంది. మనతోపాటు మన తోటి మానవాళికి సేవా విధానంలో తోడ్పడినట్లయితే, సామాజిక సేవ నేత్రము, ఆధ్యాత్మిక సేవ నేత్రము అనే రెండు నేత్రాలు వికసించి, ఈశ్వరత్వాన్ని మానవత్వం రూపంలో పొంది తరించవచ్చు అన్నారు. ఈ దృక్పథంతోనే ప్రతి ఒక్కరూ ప్రకృతిని పరిరక్షించుకోవడం కోసం, గురుదక్షిణగా మూడు మొక్కలు ప్రతి సంవత్సరం నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ సభా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న శ్రీ పరవస్తు ఫణిశయన సూరి ప్రసంగిస్తూ ఈ పీఠం ఆరవ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా వారు ఆంధ్ర కవి కులగురువు అని, వారి పద్యాలు సమాజానికి అద్భుతమైన సందేశం అందిస్తున్నాయని చెబుతూ, ఉమర్ ఆలీషా మహాకవి రచించిన కొన్ని పద్యాలను ఆలపించి సభను అలరింపజేశారు.

తరువాత మరొక అతిథి ఆచార్య శ్రీ డి.వేంకట రావు మాట్లాడుతూ గురువు యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

అలాగే ముఖ్యాతిథిగా పాల్గొన్న సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీ జి.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శం అన్నారు.

కార్యక్రమంలో గత 25 సంవత్సరాలుగా భీమవరం – కవిశేఖర డా. ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా విశేషమైన సాహితీ కృషి చేసిన పండితులకు శ్రీ హుస్సేన్ షా కవి స్మారక పురస్కారం అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా 2025వ సంవత్సరం పురస్కారాన్ని శ్రీ ఆచార్య గోరుగొంతు అక్కుభొట్లు శర్మగారికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల దివ్య హస్తాల మీదుగా అందించి పీఠం పక్షాన ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కుభొట్లు శర్మగారు ప్రసంగిస్తూ అద్వైత వేదాంత తత్వాన్ని ఈ పీఠంలో సూఫీ తత్వంతో మేళవిస్తూ, ఆచరణాత్మకంగా ప్రబోధిస్తున్నారు. ఈ పీఠం ఆరవ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మహాకవి రచించిన సూఫీ వేదాంత దర్శము గ్రంథాన్ని అభ్యసించి, తత్వ జ్ఞానం పొంది జన్మ సార్థకతకు ప్రయత్నించాలని అన్నారు. ఈ పురస్కారం సద్గురువర్యుల ఆశీస్సులకు ప్రతీకగా భావిస్తున్నాను, ఆధ్యాత్మిక సేవకు, సామాజిక సేవకు ప్రతిరూపమైన ఈ తత్వం విశ్వానికి ఆదర్శం అని శ్లాఘించారు.

కార్యక్రమంలో అతిథులుగా శ్రీ కలిదిండి గంగరాజు, శ్రీ సూరంపూడి వీరభద్రరావు, శ్రీ ఎస్.వి సత్యనారాయణ తదితర పుర ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీమతి మాధురి ఆలపించిన గీతం సభ్యులను రంజింపజేయగా, శ్రీ ప్రొఫెసర్ డా. ఆనంద్ పింగళి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపడుతున్న సేవలను సభకు వివరించారు.

కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుండి వచ్చిన సభాసభ్యులు అశేషంగా పాల్గొని, సద్గురు దర్శనం పొంది భోజన ప్రసాదం స్వీకరించారు.

You may also like...