Bavuruvaka Sabha 20-Dec-2025
బవురువాకను బంగారు వాక చేద్దాం!

బవురువాక గ్రామాన్ని బంగారు వాక గ్రామంగా తీర్చిదిద్దుకుందామని పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషావారు పిలుపునిచ్చారు. 20-12-25వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు బవురువాక గ్రామంలో డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల అధ్యక్షతన ఆధ్యాత్మిక సభ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా వారు ప్రసంగిస్తూ బవురువాక పవిత్రమైన ప్రదేశం, ఇది బవురువాక కాదు, బంగారు వాకగా చెప్పుకోవచ్చు. నాల్గవ పీఠాధిపతి కహెనేషావలీవారు పవిత్ర తాండవ నది సమీపాన సంచరించి అచ్చటి ప్రజలను పునీతులను చేయగా, వారి కుమారులు శ్రీ మొహియద్దీన్ బాద్షా వారు కొండవాలు ప్రాంతంలో తపస్సు చేసి ఆ ప్రాంతాన్ని పునీతం చేసారు. అలాగే 8వ పీఠాధిపతి పరబ్రహ్మ మొహియద్దీన్ బాద్షా వారు ఈ బవురువాక ప్రదేశంలో నడయాడి ఈ ప్రాంతాన్ని పావనం చేసారు. అవతారులు మనకు ఎప్పుడూ సామాన్యంగా కనిపిస్తారు. కాని వారు చేసే అద్భుత కార్యాలు చూసి వారిని భగవత్స్వరూపంగా గ్రహించి తరించాలని చెప్పారు. సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ అనే రెండు నేత్రాలతో దర్శించినప్పుడు మానవత్వం ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలనే కాక, ఇక్కడ ముప్పై మొక్కలనైనా నాటి ప్రకృతిని రక్షించాలని, అదే భగవంతుని సేవగా గ్రహించాలని అన్నారు.
కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు శ్రీ అహ్మద్ అలీషా వారు, శ్రీ హుస్సేన్షా వారు మాట్లాడుతూ ఆనాటి కాలంలో శ్రీ మొహియద్దీన్ బాద్షా సద్గురువర్యులు పాదము మోపి ఈ ప్రదేశాన్ని పావనం చేసి, ఈ బవురువాకలో అన్ని సదుపాయాలను కల్పించి, జ్ఞానబోధ చేసి ప్రజలను ఉద్ధరించారని అన్నారు. ప్రజలు దాహార్తితో ఎంతో సతమతమౌతున్న కాలంలో వారి కోరిక తీర్చడానికి ఈ ప్రాంతంలో మంచినీటి బావిని తవ్వించి, ప్రజల దాహార్తిని తీర్చారని దానికి ప్రజలెంతో ఆనందించారని చెప్పారు.
ఈ సభలో బవురువాక సర్పంచ్ శ్రీ మండా అప్పారావు మాట్లాడుతూ శ్రీ స్వామి వారు మాకెంతో మేలు చేశారని చెప్పారు. ఎమ్.పి.టి.సి. శ్రీ పిట్టె అప్పారావు మాట్లాడుతూ పీఠాధిపతులు మాకు రామాలయం కట్టించారని, అలాగే మెడికల్ కార్యక్రమాలు నిర్వహించారని, అందుకు గురువుగారికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో శ్రీమతి దొడ్డి మంగయమ్మ, శ్రీ పాకల చిన్నబ్బాయి, శ్రీ వి.వి.వి.సత్యనారాయణ తదితరులు ప్రసంగించగా, శ్రీ గోసుల రమణ సభా వ్యాఖ్యానం చేశారు. బవురువాక గ్రామ ప్రజలు, పీఠ సభ్యులు పాల్గొని సభను విజయవంతం చేశారు.
