Karthika Pournami Sabha | పదమూడవ రోజు | 05 November 2025

Karthika Pournami Sabha | 05 November 2025

“ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం కలిగించే కాలం కార్తికమాసం”
-పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం కలిగించే కాలం కార్తిక మాసం అని, కార్తిక దీపం చంద్రుడి యొక్క తేజస్సుతో కలిసి మనలో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుందని కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో అనుగ్రహ భాషణ చేసారు. మానవుడు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడంతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాలుపంచుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని తెలిపారు. సామాజిక నేత్రం, ఆధ్యాత్మిక నేత్రాలను వృద్ధి చేసుకుంటే తాను కోరుకునే ముక్తికి మార్గం సుగమమౌతుందని అన్నారు.

మానవునిలో ఆధ్యాత్మికమైన విలువలు లోపించడం వల్లనే మానవత్వపు విలువలు రోజు రోజుకూ నశించిపోతున్నాయని ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానాన్ని తెలుసుకోకపోవడం వలన మానవుడు ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం, వంటి చెడు గుణాలకు లోను కాబడి ప్రపంచ వినాశనానికి పూనుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రస్తుత సమాజంలో ప్రతి వ్యక్తీ ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను సభకు వివరించారు. ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీసాధన అవలంబించడం ద్వారా మానవుడు తనలోని అరిషడ్వర్గాల ప్రభావాన్ని స్థాయి చేసుకోగలుగుతాడని తెలిపారు. మనస్సును, శరీరాన్ని ఏకీకృతం చేసే శక్తిని ధ్యాన సాధన కల్పిస్తుందని అన్నారు. ఆత్మ పరమాత్మగా పరిణామం చెందే విధానాన్ని ఈ ధ్యానశక్తి చూపుతుందని తెలిపారు. మానవునిలో ఆధ్యాత్మిక జీవన తత్త్వము ఏర్పడాలంటే జ్ఞానాన్ని ప్రసాదించే సద్గురువుల విశిష్టత సమాజంలో విస్తరింపబడాలని అన్నారు.

కార్యక్రమంలో కుమారి అమృతవల్లి, ‘అవధాని’ శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరావు, ఎన్. టి.వి. ప్రసాద వర్మగార్లు మాట్లాడుతూ మానవుడు తన ప్రవర్తనను బాగుచేసుకుంటూ భక్తి, విశ్వాసం, లక్ష్యం, జ్ఞానము అనే నాలుగు మూల స్తంభాలుగా చేసుకుని గురుముఖంగా ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానాన్ని పెంపొందించుకుంటే, మానవత్వపు విలువలు వికసిస్తాయని వెల్లడించారు. మానవుడు తనలోని ఆత్మను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అని అన్నారు. సద్గురువు ద్వారా నిశ్చిత తత్త్వము ఏర్పడుతుందని తెలిపారు. అన్ని మతాలయొక్క కలయికే విశ్వ మతమని తెలుపుతూ, వందలాది సంవత్సరాలుగా మతాలకు అతీతంగా పీఠాన్ని నిర్వహిస్తూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాన్ని ముందుకు నడిపిస్తున్న పీఠాధిపతి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల కృషిని కొనియాడి వారి మార్గంలో భక్తులంతా పయనించాలని తెలిపారు.

పీఠం నిర్వహిస్తున్న తాత్త్విక బాలవికాస్ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు సభలో చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు సభ్యులను ఆకట్టుకున్నాయి. పీఠం సభ్యురాలు శ్రీమతి ఉమా ముకుంద సంగీత పర్యవేక్షణలో సభ్యులు ఆలపించిన కీర్తనలు రంజింప చేసాయి.

You may also like...