New Year Jnana MahaSabha -2026 | నూతన సంవత్సర మహాసభ | 1st Jan 2026
జీవిత ఆశయం సాధించడానికి ఆధ్యాత్మిక జ్ఞానశక్తి అవసరం
జీవిత ఆశయం సాధించడానికి మానసిక శక్తి, మనోధైర్యం, మానసిక సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక తాత్త్విక జ్ఞాన శక్తి అవసరం అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1వ తేదీ గురువారం ఉదయం 9:30 గంటలకు విశ్వవిజ్ఞాని, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన జ్ఞానమహాసభలో పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేస్తూ మనసును స్థాయి పరుచుకునే తత్వము ఆధ్యాత్మిక తత్వమని, మన జీవితంలో ఏర్పడుతున్న చిన్న చిన్న వివాదాల నుండి తొలగి, నిరంతరం సుఖసంతోషాలతో జీవించడానికి మంచి చెడుల విశ్లేషణతో కూడిన మానసిక స్థితిని ఆధ్యాత్మిక తత్వం ద్వారా ఏర్పరచుకోవాలని ప్రబోధించారు. మానవత్వాన్ని బోధించేదే మతం అని, మానవత్వాన్ని హరించేది మతం కాదు, రాక్షసత్వం అని అభివర్ణించారు.
మన శరీరంలో గుండె, కిడ్నీలు మొదలైన అవయవాలు నిరంతరం శ్రమిస్తూ ఉన్నట్లుగా మన జీవితంలో మనమంతా ఆశయం వైపు పట్టుదలతో ప్రయత్నం చేసి, సాధించాలనే తపనతో ప్రయత్నించినప్పుడు ఆశయాన్ని సాధించి ఆనందం పొందవచ్చని తెలిపారు. మానసిక వ్యవస్థలో అనారోగ్యం ఏర్పడినట్లయితే అది శారీరకంగా, మానసికంగాను ఇబ్బందులకు గురిచేస్తుందని, మనసును తాత్త్విక జ్ఞాన శక్తితో నింపుకోవడానికి సద్గురు మార్గంలో త్రయీ సాధన ఆచరించాలని ప్రబోధించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం గురు దక్షిణగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి ప్రకృతిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమెరికా నుండి విచ్చేసిన శ్రీ కిరణ్ ప్రభ మాట్లాడుతూ ఈ పీఠం నిర్వహిస్తున్న బాలవికాస్ కార్యక్రమాలను కొనియాడారు. త్యాగం గురించి ప్రసంగిస్తూ ఈ పీఠంలో ట్రస్ట్ తరఫున చేసే కార్యక్రమాలను శ్లాఘించారు.
మరొక అతిథి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ డా.కొండా నరసింహారావు, శ్రీమతి అలివేలు మంగాదేవి దంపతుల శంఖారావంతో సభ ప్రారంభమైంది. కార్యక్రమంలో తాత్త్విక బాల వికాస్ చిన్నారులు ఉర్వీష, వర్షిణి, కైవల్య జ్యోతి, నవ్యశ్రీ, భవిజ్ఞశ్రీ ప్రసంగాలు అందరినీ అలరించాయి. శ్రీమతి ఉమాముకుంద నేతృత్వంలో సంగీత విభావరి కీర్తనలు అందరినీ రంజింప చేశాయి. మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఛైర్మన్ శ్రీ పిల్లి తిరుపతిరావు మరియు వారి బృందం సద్గురువర్యులను సత్కరించారు.
నూతన సంవత్సర విశేషాలను శ్రీ వై. ఉమేష్ కుమార్ సభకు తెలియజేయగా, అవధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు సభా వ్యాఖ్యానం చేశారు. కార్యక్రమానంతరం వివిధ ప్రదేశాల నుండి వచ్చిన అశేష భక్తజనులు సద్గురువర్యుల దర్శనం పొంది భోజన ప్రసాదం స్వీకరించారు.
