Ugadi Sabha 2025 (Telugu New Year) – 30th March 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సభ

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ – పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా

Ugadi 2025

మానవుడు తన స్వార్థం కోసం పంచభూతాలను కలుషితం చేయడం వలన వాటిలో సమతుల్యత లోపించి, తరచుగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ, మానవ వినాశనం కలుగుతుందని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే ఈ భూమిపై మానవ మనుగడ కొనసాగుతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం, కాకినాడ రోడ్ నందలి నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేసారు. పంచభూతాలతో కూడిన ప్రకృతి ద్వారా భూగ్రహంపై జీవించడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉగాది రోజున ఏర్పాటు చేసే పంచాంగ శ్రవణం భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలతో పాటుగా విపత్తులను గురించి కూడా సూచనలు చేస్తుందని, ఆ సూచనలను పాటించి ముందుగా మేల్కొని రక్షణ చర్యలు చేపడితే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

దుష్టత్వం ద్వారా రాక్షసత్వాన్ని, మంచి పనుల ద్వారా మానవత్వాన్ని మానవుడు పొందుతాడని, అందుచేత మానవత్వాన్ని పెంపొందించుకునే దిశగా మానవుడు నిరంతరం కృషి చేస్తే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించారు. అంతరించి పోతున్న మానవత్వపు విలువలు పెంపొందించు కోవాలంటే ముందుగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల రూపంలో మనలో ఇమిడి ఉన్న అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకోవాలని వెల్లడించారు. ఆధ్యాత్మిక తాత్త్విక జ్ఞానం ద్వారా జీవన సత్యాలు తెలియబడతాయని, అదే మానవుని మనుగడకు పునాది అని అన్నారు.

గురువు ద్వారా తాత్త్విక జ్ఞానాన్ని పొందగలిగితే అరిషడ్వర్గాలను స్థాయి చేసుకోవచ్చని అన్నారు. పీఠం అందిస్తున్న జ్ఞాన, ధ్యాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీసాధన ద్వారా దేహానికి భుక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తి లభిస్తాయని ఉపదేశించారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనం వంటిదే జీవితమని, జీవన గమనంలో కష్ట, సుఖాలను సమభావనతో స్వీకరించగలిగినపుడే జీవిత పరమార్థం తెలియబడుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అందుకోసం ప్రతి సభ్యుడు మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపు నిచ్చారు. నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని తెలిపారు.

అనంతరం వేసవిని దృష్టిలో పెట్టుకుని నూతన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన పక్షుల మరియు మజ్జిగ చలివేంద్రములను, ఆశ్రమంలో పండించిన ప్రకృతి సిద్ధ పండ్లు, పుష్పాల స్టాల్స్, ప్రకృతి మాతృ ఆర్గానిక్ ఫుడ్స్ స్టాల్ ను సద్గురువర్యులు ప్రారంభించారు. తదుపరి పీఠం నిర్వహిస్తున్న ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠంలో సేవలందిస్తున్న 90 మంది వాలంటీర్లకు నూతన వస్త్రాల పంపిణీ, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, దివ్యాంగులకు వీల్ ఛైర్ల పంపిణీ, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ అందజేత, బీసీ వసతి గృహంలోని విద్యార్థులకు ఫ్యాన్ల పంపిణీ, పరివర్తన అనాథ బాల బాలికల సంస్థకు ఆర్థిక సహకారం, పక్షుల ఆహారం కొరకు ధాన్యపు కుచ్చుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం ప్రముఖ వాస్తు, హస్త, జ్యోతిష శాస్త్ర నిపుణురాలు శ్రీమతి కెవివి. ఎస్. శారద సభలో పంచాంగ ప్రవచనం చేసారు. ముఖ్య అతిథులు ఆక్టి ఇన్ఫోటెక్ డైరెక్టర్ కమల్ బెయిడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ కృష్ణ ఆదిశేషు సభలో ప్రసంగిస్తూ ప్రతి వ్యక్తి సద్గురు బోధనలను ఆచరిస్తూ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విశ్వావసు నామ సంవత్సరంలో సుఖ శాంతులతో జీవించాలని తెలిపారు. ప్రముఖ గీతావధాని, అవధాన కళాధర యర్రంశెట్టి ఉమామహేశ్వర రావు సద్గురువర్యులు ప్రబోధించిన జ్ఞానం మన జీవితాలకు బంగారు బాట వేస్తుందని, విశ్వావసు నామ సంవత్సర ఉగాది సకల శ్రేయస్సులు అందించాలంటే తాత్త్విక భావన ఏర్పరచుకోవాలని పద్యాలను వ్యాఖ్యానిస్తూ ప్రసంగించారు.

మహామంత్ర విశిష్టతను తెలిపిన అబ్బిరెడ్డి అనూష ప్రసంగం ఆకట్టుకుంది. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఉమాముకుంద్ బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింప చేసాయి.

సభలో పాల్గొనడానికి రాష్ట్రం నలు మూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేసారు. ఉచిత భోజన సదుపాయం కల్పించారు.

You may also like...