Avatari Sri Hussain Sha Sathguru 120th birthday celebrations | 9th September 2025
మానవ జీవన మనుగడకు దిక్సూచి – “షాతత్త్వ” గ్రంథం
పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా 120వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేసారు.
మానవ భౌతిక శరీరము జీవించుటకు ఆధారమైన ప్రాణశక్తి అనే చైతన్యశక్తి ఏడు కేంద్రముల వద్ద మానవ శరీరములో ప్రవేశించడం జరుగుచున్నదని, ఈ కేంద్రముల వద్దనే మానవుడు తన ఆధ్యాత్మిక ప్రయాణములో తలుపులు తట్టి ఆధ్యాత్మిక మార్గమును అన్వేషించవలసి ఉన్నదని పేర్కొన్నారు. ఈడ, పింగళి, సుషుమ్న నాడులు ఈ ఏడు కేంద్రముల ద్వారా వ్యాప్తి చెంది ఉన్నవని, ఈ రహస్యములను సప్తమ పీఠాధిపతి షాతత్త్వము అనే గ్రంథంలో నేను, కాలము, శ్వాస, శూన్యము, హంస, దృశ్యము, కుండలిని అనే ఏడు విషయ రహస్యములు సులభ శైలిలో అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక వికాసము కొరకు అందజేయడం జరిగినదని తెలిపారు. ఈ గ్రంథ రాజము ఇప్పటికి ఏడు ముద్రణలను అనగా ఏడు కూర్పులను సంతరించుకుని, ఉమర్ ఆలీషా గ్రంథమండలి ద్వారా నేటికీ లభ్యమౌతుందని వెల్లడించారు. ఆంగ్లములో షా ఫిలాసిఫీగా అనువాదము చేయడం జరిగిందని అన్నారు. ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదివి ఆ విషయములు ఆకళింపజేసుకుని, ఆచరించాలని తెలిపారు. ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధనను అలవరచుకోవడం ద్వారా తాత్త్విక జ్ఞానం తెలియబడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పీఠ సభ్యులకు పిలుపునిచ్చారు.
తదుపరి “మాతృ వందనం” గ్రంథాన్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఆవిష్కరించారు.
సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహావీర్ ఇంటర్నేషనల్ ప్రతినిధి కమల్ బేడ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ మానవులు భేదభావాలను విడనాడి సాటి మానవుని పట్ల సమదృష్టి కలిగి ఉండాలని బోధిస్తూ విశ్వ మానవ శ్రేయస్సే పరమావధిగా సాగుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని తెలిపారు. ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం, సామాజిక సేవలను రెండు నేత్రాలుగా చేసుకుని పీఠాధిపతి ఆలీషా స్వామివారు చేస్తున్న సేవలను కొనియాడారు. సంగీత విభావరి కార్యక్రమంలో ఉమా ముకుంద బృందం ఆలపించిన కీర్తనలు అందరినీ రంజింపచేసాయి.
ఈ సందర్బంగా జె.డి. న్యూస్ ఎడిటర్, రామ్ దాస్ వాజ్ పాయ్, పతంజలి శ్రీనివాస్, బాణాల దుర్గాప్రసాద్ సిద్ధాంతి, శివరామకృష్ణ స్వామీజీ తదితరులు పీఠాధిపతివారిని దర్శించుకున్నారు





















