ఆజాది కా అమృతోత్సవ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ కవి, స్వాతంత్ర్య సమర యోధులు కవి శేఖర డా. ఉమర్ ఆలీషా గారి ముని మనువడు అహ్మద్ ఆలీషా గారికి సన్మానం జరిగినది

ప్రెస్ నోట్
ఆజాది కా అమృతోత్సవ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ కవి, స్వాతంత్ర్య సమర యోధులు కవిశేఖర డా. ఉమర్ ఆలీషా గారి ముని మనువడు అహ్మద్ ఆలీషా గార్ని పిఠాపురం శాసన సభ్యులు శ్రీ పెండెం దొరబాబు, పిఠాపురం మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీ గండేపల్లి సూర్యావతి రామారావు అనే బాబీ గారు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీ బి. రామ్మోహన్ రావు, పట్టణ వైస్ చైర్మన్ శ్రీ పచ్చిమళ్ళ జ్యోతి అప్పలరాజు మరియు అనేక మంది వార్డ్ కౌన్సిలర్ల, మున్సిపల్ అధికారులు, సచివాలయం సిబ్బంది, పలువురు మహిళా సంఘాల నేతలు శ్రీ అహ్మద్ ఆలీషా గార్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి బాబీ గారు అధ్యక్షత వహించి, మాట్లాడుతూ, వందలాది సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం షష్ట పీఠాధిపతి కవి శేఖర డా. ఉమర్ ఆలీషా గారు, 50 కి పైగా గ్రంధాలు రచించారని, స్వతంత్ర ఉద్యమం లో మహాత్మా గాంధీ గారితో కలిసి పాల్గొన్నారని అన్నారు. శాసన సభ్యులు శ్రీ పెండెం దొరబాబు మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర గల పీఠానికి పీఠాధిపతి గాను, మహా కవిగా, విద్యావేత్తగా, రాజనీతిజ్ఞునిగా, జాతీయ వాదిగా, బహు భాషా కోవిధునిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సమత, మమత, మానవతలకు ప్రతీక గా అభివర్ణించారు. భారత జాతీయ పార్లమెంట్ కు దక్షిణ మద్రాస్ నియోజక వర్గం MP గా 10 సంవత్సరాలు, పది కమిటీలలో కీలక సభ్యునిగా భారత మాతకు సేవలందించారని కొనియాడారు. వారి ముని మనవడు డా. ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతి గా, లక్షలాది మంది కి జ్ఞాన బోధ చేస్తూన్నారని అన్నారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీ బి. రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ దేశ సమగ్రత, విశ్వ మానవ శాంతిని, స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిలించే, డా. ఉమర్ ఆలీషా మహా కవి రచనలు మహోన్నత మైనవిగా అభివర్ణించారు.
సన్మాన గ్రహీత అహ్మద్ ఆలీషా గారు మాట్లాడుతూ 16వ ఏట నుండే కవి శేఖర డా. ఉమర్ ఆలీషా గారు ఆధ్యాత్మిక, సాంఘిక, సామాజిక, దేశ భక్తి గేయాలు రచించారని అన్నారు. ఈ రోజు నాకు జరిగిన సన్మానానికి, కృతజ్ఞతలు అని తెలిపారు.
పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు ఉమర్ ఆలీషా గారి జాతీయోద్యమ స్ఫూర్తిని, ఖిలాఫత్ సహాయ నిరాకరణ ఉద్యమం, హిందూ ముస్లిం సమైక్యత తదితర అంశాలను సభకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలీషా గారి సోదరులు కబీర్ షా, హుస్సేన్ షా, పాషా, కలీల్ షా, ఫజల్ మరియు పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, శ్రీ ఎ.వి.వి సత్యనారాయణ, శ్రీ రేఖా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్

You may also like...