Kavisekhara Dr.Umar Alisha 80th Vardhanthi | Sahithi Samithi 32nd Anniversary Sabha – 23-Jan-2025
భీమవరంలో ఘనంగా కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా 80వ వర్ధంతి సభ | సాహితీ సమితి 32వ వార్షికోత్సవ సభ
సమాజ హితాన్ని కోరేది సాహిత్యం: పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి డాక్టర్ ఉమర్ ఆలీషా పురస్కారం అందజేత
సమాజ హితాన్ని కోరేది సాహిత్యమని, సాహిత్యానికి కుల, మతాలు లేవని డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ఆధ్వర్యవంలో పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని స్థానిక త్యాగరాజ భవనం వద్ద గురువారం నిర్వహించిన దివంగత 6వ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా 80వ వర్ధంతి సభ సందర్భంగా నవమ పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు మాట్లాడుతూ చిన్నతనంలోనే సాహితీ సేవను ప్రారంభించిన మహనీయుడు కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా అని తెలిపారు. 18వ శతాబ్దంలో సమాజంలో స్త్రీల వెనకబాటుతనాన్ని గుర్తించి స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన మహోన్నతుడు ఉమర్ ఆలీషా అని పేర్కొన్నారు. సమాజాన్ని అధ్యయనం చేసిన ఆయన సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరయోధుడిగా, కవి, రచయితగా మహిళాభ్యుదయానికి, హరిజనోద్ధరణకు నిరంతరం కృషి చేసారని వెల్లడించారు.
ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా అందిస్తున్న స్మారక సాహితీ పురస్కారానికి బహుముఖ ప్రజ్ఞాశాలి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత, కేంద్రీయ
విశ్వ విద్యాలయం విశ్రాంత ఆచార్యులు “ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం”ను ఎంపిక చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా భీమవరంలో 32 సంవత్సరాలుగా విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహితీ సేవ చేస్తున్న సమితి సభ్యులను పీఠాధిపతి అభినందించారు. తదుపరి 6వ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా రచించిన బర్హిణీ దేవి పద్య కావ్యానికి సమగ్ర వ్యాఖ్యానాన్ని
అందిస్తూ ఆచార్య బేతవోలు
రూపొందించిన గ్రంథాన్ని ఉమర్ ఆలీషా స్వామివారు సభలో ఆవిష్కరించారు.
పురస్కార గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ ఉమర్ ఆలీషా మహాకవి తిరుపతి వేంకట కవులకు సమకాలీకులని తెలిపారు. శతాధిక కావ్యాలు, గ్రంథాలు రచించిన గొప్ప పండితుడని కొనియాడారు. ఉమర్ ఆలీషా రచించిన బర్హిణీ దేవి కావ్యానికి వ్యాఖ్యానం రచించే అవకాశం తనకు రావడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సాహితీ సమితి పురస్కారాన్ని జాతీయ స్థాయి పురస్కారంగా సంబరపడుతున్నానని వెల్లడించారు. పీఠాధిపతి
ఆలీషాకు, సాహితీ సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక అతిథి శ్రీ మంతెన రామచంద్రరాజు మాట్లాడుతూ
కులాలు వేరైనా, మతాలు వేరైనా అందరి ఆలోచనలు ఒక్కటే అనే విషయాన్ని సాహితీ సభ తెలియ చేస్తుందని అన్నారు. గత 32 సంవత్సరాలుగా భీమవరంలో సాహితీ సభను నిర్వహిస్తూ అనేకమంది ప్రముఖ సాహితీవేత్తలకు పురస్కారాలను అందిస్తున్న సాహితీ సమితి సేవలను కొనియాడారు. సాహితీ సభలకు తల్లితండ్రులు తమ పిల్లలను కూడా తీసుకుని రావాలని సూచించారు. దేశం పట్ల సమాజం పట్ల అందరికీ శ్రద్ధాసక్తులు ఉండాలని అన్నారు.
అనంతరం పీఠాధిపతి ఉమర్ ఆలీషా పురస్కార గ్రహీతకు స్మారక పురస్కారంతో పాటుగా 50,116 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.