97th Annual Congregation | MahaSabhalu – 10th Feb 2025 – Day 2
10th Feb 2025 – MahaSabha Day 2 – 10-ఫిబ్రవరి -2025 వార్షిక మహాసభ – రెండవ రోజు
“మానవుడు కష్ట, సుఖాలను సమ భావంతో స్వీకరించాలి”….. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు
కష్ట, సుఖాలను మానవుడు సమ భావంతో స్వీకరించాలని, అలా చేసినపుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవరోజు సోమవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో స్వామివారు భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు. మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్ట, సుఖాలను సమన్వయ పరచుకుంటూ వాటిని ఏకత్వ భావనతో స్వీకరించాలని పేర్కొన్నారు. మానవునిలో మంచి చెడులను ప్రేరేపించేది మనసు అని అన్నారు. మనసులో భావాలను బట్టి మనిషి మనుగడ ఉంటుందని తెలిపారు. మనసు ద్వారా మంచి, చెడు గుణ గణాల శక్తి మానవుడిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తత్త్వం, తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గంవైపు మరల్చుకోవచ్చునని అన్నారు. అరిషడ్వర్గాలను స్థాయిపరచుకుంటే అది సాధ్యమౌతుందని తెలిపారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీసాధన అవలంబించడం ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలు నియంత్రించ బడతాయని వెల్లడించారు. మానవత్వమే మతం, మానవత్వమే ఈశ్వరత్వం అనే స్థాయికి ప్రతి ఒక్కరూ చేరుకోవాలని తెలిపారు.
అనంతరం పీఠం రూపొందించిన వివిధ కరపత్రాలను, మరియు ఆధ్యాత్మిక గ్రంథాలను అతిథుల సమక్షంలో ఆవిష్కరించారు.
ముఖ్య అతిథి నిష్కామ ఫౌండేషన్ నిర్వాహకురాలు అరుణ వైరాగ్యం అనే అంశం గురించి సభలో ప్రసంగించారు. నిత్యము, అనిత్యములపై అవగాహన పెంచుకోవడమే వైరాగ్యమని అన్నారు. మానవుడు కోరికలు లేని స్థితికి చేరుకుంటే వైరాగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. ధనం, బంధం, కీర్తి – ఈ మూడింటి పరిధులను అర్థం చేసుకుని, మనిషి తన జీవన పయనాన్ని కొనసాగించాలని వెల్లడించారు. ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం ద్వారా ప్రతి వ్యక్తిలోనూ మానవత్వపు విలువలను పెంపొందించడానికి నిరంతరం పాటు పడుతున్న పీఠాన్ని సందర్శించడం తన కెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు.
పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏ.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఆనందం యొక్క రహస్యాలను తెలియజేసారు. మానవుడు తన జీవితంలో శాశ్వతానందం పొందాలంటే సద్గురువును ఆశ్రయించి జ్ఞాన సాధన చేయాలని పేర్కొన్నారు.
పీఠం ఎన్.ఆర్.ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు కృత్రిమ మేధ, ఆధ్యాత్మికత అనే అంశం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి ప్రసంగించారు. నూతనంగా ఆవిష్కరించబడే ప్రతి అంశం మనిషి మంచి కోసమే అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు చెడు కోసం కూడా ఉపయోగిస్తున్నారని భవిష్యత్తులో ఊహించని అద్భుతాలకు మూలమయ్యే ఈ కృత్రిమ మేధను మానవుడు మంచిని పెంపొందించే
ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా పీఠాధిపతి సోదరులు మరియు పంచాంగ కర్త బాణాల దుర్గా ప్రసాదాచార్యులు ఉమర్ అలీషా స్వామివారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. భవానీ పీఠం పీఠాధిపతి శివరామ కృష్ణ, షేక్ మహమ్మద్ ఇక్బాల్, డా.డి.పద్మావతి, ఉమర్ ఆలీషా సాహితీ సమితి సభ్యులు టి. సాయి వెంకన్న బాబు, ఎ.రాధాకృష్ణ, జి. రమణ, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పిల్లి తిరుపతి రావు, కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కాసుబాబు, కొండేపూడి శంకరరావు, యెగ్గిన నాగబాబు తదితరులు పీఠాధిపతివారిని దర్శించుకుని ప్రసంగించారు.
తాత్త్విక బాలవికాస్ విద్యార్థిని సన్నిబోయిన తేజస్విని మహామంత్రం విశిష్టతను గురించి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఉమా ముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన మరియు బస్ సౌకర్యాలను, వృద్ధులకు, దివ్యాంగులకు వీల్ చైర్ సదుపాయాలు కల్పించారు.
10th Feb 2025 – Morning
10th Feb 2025 – Afternoon