97th Annual Congregation | MahaSabhalu – 11th Feb 2025 – Day 3

11th Feb 2025 – MahaSabha Day 3 – 11-ఫిబ్రవరి -2025 వార్షిక మహాసభ – మూడవ రోజు

కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలి…..పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు

సామాన్యుని మొదలుకొని తత్త్వవేత్తల వరకూ కాలం అందరినీ పరీక్ష పెడుతుందని, కాలానికి ఎవరూ అతీతులు కారని, కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్త్విక జ్ఞానం పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం పిఠాపురం – కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేసారు. పంచ భూతాత్మక శక్తి స్వరూపుడే మానవుడని తెలిపారు. మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలం అని, తాత్త్వికులు, యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏదీ ఈ సృష్టిలో లేదని వెల్లడించారు. ఆధ్యాత్మిక తాత్త్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు. నిరంతర కృషి ద్వారానే సత్ఫలితాలను పొందగలమని, కావున ప్రతి ఒక్కరూ కాలాన్ని సద్వినియోగ పరుచుకోవాలని పేర్కొన్నారు. మానసిక తృప్తి మానవుడిని సంస్కార వంతుడిని చేస్తుందని వెల్లడించారు. ప్రతి మానవుడు విలువైన జీవితకాలాన్ని వృద్ధి పరచుకోవాలని, ఈ ప్రయత్నంలో మనసును అల్లకల్లోలం చేసేటువంటి అరిషడ్వర్గాలను స్థాయిపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక తాత్త్విక జ్ఞానం మంచి, చెడులను విశ్లేషించుకునే శక్తిని ఇస్తుందని తెలిపారు. ప్రతి చిన్న విషయానికి అసహనానికి గురౌతూ, అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్న మానవుడు తన జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సహనశక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధనను అలవరచుకోవడం ద్వారా సహనశక్తి వృద్ధిచెంది తాత్త్విక జ్ఞానం తెలియబడుతుందని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఠం చేపట్టిన “నా మొక్క, నా శ్వాస” కార్యక్రమంలో ప్రతి సభ్యుడూ పాల్గొని తమ వంతుగా ఒక్కో మొక్కను నాటి వాటిని సంరక్షించాలని పిలుపు నిచ్చారు. నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండరుతో సమానమని అన్నారు. మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న పీఠం విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు.

సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠాపురం మాజీ శాసన సభ్యుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మాట్లాడుతూ మానవుడు గురువును ఆశ్రయించి భ్రాంతిశక్తులను తొలగించుకున్నప్పుడు తనలోని పరమాత్మను దర్శించుకోగలుగుతాడని తెలిపారు. సూఫీ తత్వవేత్తలైన ఈ పీఠాధిపతులు జ్ఞాన మహాసభల ద్వారా బ్రహ్మవిద్యను నేర్పుతూ విశ్వ మానవ శ్రేయస్సు కొరకు పాటుపడుతున్నారని, కొనియాడారు. పీఠాధిపతి ద్వారా తాత్త్విక జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరికొంతమందికి పంచాలని సూచించారు.

పీఠాధిపతి సోదరుడు అహ్మద్ అలీషా మాట్లాడుతూ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతుల యొక్క విశిష్టత, మాతృమూర్తుల యొక్క త్యాగాలు, పీఠం సభ్యుల సేవలు సవివరంగా సభకు వివరించారు. వందలాది సంవత్సరాలుగా, వేదాంత విద్యను కాలానుగుణ్యంగా సభ్యులకు ఉపదేశిస్తున్న ఏకైక పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు.

అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, వీల్ చైర్స్, పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను, ఎన్. ఆర్. ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు, సన దంపతులు భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రం వారి కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టిమ్యూలేటర్ లను స్వామివారు, ముఖ్య అతిథులు కలిసి సభలో అందించారు. తదుపరి పీఠం రూపొందించిన పలు కరదీపికలు, గ్రంథాలను ఆవిష్కరించారు.

పీఠం నిర్వహిస్తున్న తాత్త్విక బాలవికాస్ ద్వారా ఆధ్యాత్మిక తరగతుల్లో శిక్షణ పొందిన చిన్నారుల ప్రసంగాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఉమా ముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభను రంజింప చేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యం, బస్, ఆటో సౌకర్యాలను వృద్ధులకు, దివ్యాంగులకు వీల్ ఛైర్ సదుపాయాలు కల్పించారు.

ఈ సందర్బంగా ఆదిత్య విద్యా సంస్థల అధినేత శేషారెడ్డి, రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ చైర్మన్ వై.డి. రామారావు, జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్, గోదావరి డెల్టా చైర్మన్ ఎం. సునీల్, బీజేపీ నేత ఎస్.వి. సత్యనారాయణ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ రాజ్ నందినీ పాండా, గీతావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పి.మంజుల తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

You may also like...