శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సభ | Ugadi Sabha 2023 (Telugu New Year) – 22nd March 2023

మానవత్వం ద్వారా దైవత్వాన్ని దర్శించవచ్చు ….పీఠాధిపతి – డా॥ ఉమర్ ఆలీషా

మానవుడు తనలో మానవత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా దైవత్వాన్ని దర్శించుకోగలుగుతాడని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం – కాకినాడ రోడ్ నందలి నూతన ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు. దుష్టత్వం ద్వారా రాక్షసత్వాన్ని, మంచి పనుల ద్వారా మానవత్వాన్ని మానవుడు పొందుతాడని, అందుచేత మానవత్వాన్ని పెంపొందించుకునే దిశగా మానవుడు నిరంతరం కృషి చేయాలని ఆలీషా పేర్కొన్నారు. అంతరించి పోతున్న మానవత్వ విలువలు పెంపొందించు కోవాలంటే ముందుగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల రూపంలో తనలో ఇమిడి ఉన్న అరిషడ్వార్గాలను స్థాయిపరుచుకోవాలని వెల్లడించారు. ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానం ద్వారా జీవన సత్యాలు తెలియబడతాయని, అదే మానవ మనుగడకు పునాది అని అన్నారు. గురువు ద్వారా తాత్త్విక జ్ఞానాన్ని పొందగలిగితే అరిషడ్వార్గాలను స్థాయిచేసుకోవచ్చని అన్నారు. పీఠం అందిస్తున్న జ్ఞాన, ధ్యాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీసాధన ద్వారా దేహానికి భుక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తి లభిస్తుందని ఉపదేశించారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనం వంటిదే జీవితమని, జీవన గమనంలో కష్ట సుఖాలను సమభావనతో స్వీకరించగలిగినపుడే జీవిత పరమార్థం తెలియబతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అందుకోసం ప్రతి సభ్యుడు మూడు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని తెలిపారు. ఈ సభలో గీతావధాని, ప్రవచనకర్త శ్రీ యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావు పంచాంగ ప్రవచనం చేసారు. ముఖ్య అతిథి న్యాయమూర్తి సుధారాణి, సాహితీవేత్త శ్రీ పరవస్తు ఫణి శయన సూరి సభలో ప్రసంగిస్తూ ప్రతి వ్యక్తీ సద్గురు బోధనలను ఆచరిస్తూ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, శోభకృత్ నామ సంవత్సరంలో జీవితాలకు బంగారు బాట వేసుకుని సుఖశాంతులతో జీవించాలని సభ్యులకు తెలిపారు. పీఠం నిర్వహిస్తున్న తాత్త్విక బాలవికాస్ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన చిన్నారులు చోడవరపు వైష్ణవి, యిళ్ళా వీర వేంకట సత్యనారాయణ, లిఖిత్ రాయుడుల ఆధ్యాత్మిక ప్రసంగాలు సభ్యులను ఆకట్టుకున్నాయి. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఉమ, ముకుంద్ దంపతులు ఆలపించిన కీర్తనలు సభికులను రంజింప చేసాయి. సభలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన వేలాదిమంది భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేసారు. ఉచిత భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా 162 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు.

#ugadi #svvvap #svvvap1472 #Ugadi2023

Photos

http://uniindia.com/experience-divinity-through-enriching-human-values-dr-umar-alisha/south/news/2938443.html#.ZBscHOTV3xM

You may also like...