Vysakha Pournami Sabha 2025
మతాలకు, కులాలకు, జాతులకు అతీతంగా అవతారులు, ప్రవక్తలు, సద్గురువులు ప్రబోధించిన జ్ఞాన మార్గం, సేవా మార్గం ఆచరిస్తే శాంతియుత సహజీవనం సాగించి, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, మారణ హోమం నివారించవచ్చు అని పీఠాధిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేసారు. సోమవారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైశాఖ పౌర్ణమి సభకు పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అధ్యక్షత వహించి ప్రసంగించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మహమ్మదు ప్రవక్త, ఏసు క్రీస్తు, బుద్ధుడు, రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు, ఈ పీఠం సద్గురువులు ప్రబోధం చేయు త్రయీ సాధన అనే తాత్త్విక జ్ఞానము పొంది, తాత్త్విక జీవన మార్గంలో నడుచుకొంటే కోట్లాది రూపాయిలు వెచ్చించినా పొందలేని తృప్తిని, శాంతిని పొందుటయే కాక, మానవత్వం ఈశ్వరత్వంగా పొందవచ్చని ఉమర్ ఆలీషా స్వామివారు అన్నారు. మత ఛాందస తత్త్వం విడనాడి, మత సామరస్యం పాటించాలని పిలుపునిచ్చారు.
నా మొక్క – నా శ్వాస అనే యజ్ఞం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు.
తాత్త్విక బాల వికాస్ చిన్నారులు యశస్వి నాగ ఉమా, ఉషా తేజస్వి, యశ్వంత్, ఉర్వీశాల ప్రసంగాలు సభికులను అలరించాయి. తాత్త్విక యువ వికాస్ నుండి కుమారి ఉమా నందిని మాట్లాడుతూ కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామివారు తపనతో ఉన్న గద్వాల్ మహా రాణి గారికి మంత్రోపదేశం చేసిన ఘాట్టాన్ని సభకు వివరించారు. పీఠం సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీ ఎన్.టి.వి. ప్రసాద వర్మ మాట్లాడుతూ బుద్ధుడి జ్ఞానోదయం గురించి తెలియచేసి, మనస్సును కట్టడి చేస్తేనే మోక్షం లభిస్తుందని అన్నారు. వైశాఖ పౌర్ణమి పుణ్య కాలంలో 45మందికి పీఠాధిపతులు ఉమర్ ఆలీషా సద్గురువర్యులు మహామంత్రోపదేశం చేశారు.