Tatvika Balavikas – Closing ceremony

9-May-2025: శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం, ప్రధాన ఆశ్రమంలోని మొహియద్దీన్ బాద్షా మెమోరియల్ సభా మందిరంలో బాల, బాలికల తాత్త్విక బాల వికాస్ వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీ షావారు అధ్యక్షులుగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పూర్ణ కుంభంతో శిబిరంలో పాల్గొన్న 145 మంది విద్యార్థులు, వారి తల్లితండ్రులు, పిల్లలకు తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులు (మెంటార్స్) సద్గురువర్యులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బాల,బాలికలు తాము పాల్గొన్న ఈ వేసవి శిబిరంలో నేర్చుకున్న విషయాలు, అనుభవాలను సద్గురువర్యులతో పంచుకున్నారు. తల్లితండ్రులు కూడా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు పొందిన విజ్ఞానాన్ని, తాత్విక చింతనను, క్రమ శిక్షణను, నైపుణ్యాలను గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎనభై ఆదివారాల పాటు ఆన్లైన్లో తాత్విక బాలవికాస్ కార్యక్రమాల్లో పాల్గొన్న 42 మంది బాల,బాలికలకు “బాల తాత్విక్” పట్టాను ప్రత్యేక స్నాతకోత్సవం నిర్వహించడం ద్వారా బహూకరించారు. మెంటార్స్ కి కూడా ప్రశంసా పత్రాలు బహూకరించారు. తదనంతరం బాల, బాలికలతో సద్గురువర్యులు ఇష్టాగోష్టి నిర్వహించి, పిల్లలు అడిగిన అనేక తాత్విక సందేహాలకు సమాధానాలు చెప్పారు. సద్గురువర్యులు వారి అనుగ్రహ భాషణంలో ఈ కార్యక్రమం పిల్లలకు ఒక మంచి భవిష్యత్ జీవితము ప్రసాదించి, అద్భుతమైన, ఆదర్శవంతమైన జీవనానికి సోపానం అవుతుందని అభివర్ణించారు. కార్యక్రమం ప్రధాన నిర్వాహకులు శ్రీ ఎ.వి.వి.సత్యనారాయణ వేసవి శిబిరంలో నిర్వహించబడిన కార్యక్రమాల నివేదికను సమర్పించారు. అవధాని యర్రంశెట్టి ఉమా మహేశ్వర రావు ఈ ముగింపు కార్యక్రమానికి వ్యాఖ్యాన కర్తగా వ్యవహరించగా, ఉపాధ్యాయుడు శ్రీ బళ్ల సుబ్బారావు వందన సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో మెంటార్స్ అరుణ కుమారి, వెంకట లక్ష్మీ, జయలక్ష్మి, స్వాతిలను సద్గురువర్యులు సత్కరించారు. వేసవి శిబిరంలో ప్రతిరోజూ వివిధ నైపుణ్యాలు నేర్పించిన సర్వశ్రీ కె.వి.ఎస్.ఎస్ ప్రసాద్, వి.జనార్దనం, అడపా లక్ష్మి, తటవర్తి సుబ్బారావు, సి.హెచ్ నరసింహారావు, యామిని ప్రసాద్, డి.రఘుబాబులను సద్గురువర్యులు సత్కరించారు.

You may also like...