Bhagavad Gita Ashtavadhanam | 14th Apr 2024 | భగవద్గీత అష్టావధానము

Bhagavad Gita Ashtavadhanam | 14th Apr 2024 | భగవద్గీత అష్టావధానము

శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో అలరించిన భగవద్గీత అష్టావధానం

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 14: విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యాన స్థానిక గౌతమ ఘాట్ లోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఆదివారం సాయంత్రం భగవద్గీత అష్టావధానం సాహితీ ప్రియులను అలరించింది. బల్లిపాడుకు చెందిన తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థి యర్రంశెట్టి ఉమామహేశ్వర రావు ఇప్పటి వరకు గీతపై 19అవధానాలు చేసి 20వ అష్టావధానం ఇక్కడ నిర్వహించారు. డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమానికి అవధాన ప్రాచార్య, పద్యకళాతపస్వి ధూళిపాళ మహాదేవమణి సభా సంచాలకులుగా వ్యవహరించారు.
కళాగౌతమి వ్యవస్థాపకులు డాక్టర్ బులుసు విఎస్ మూర్తి శ్లోకదర్శనము, శతావధాన శరచ్చంద్ర డాక్టర్ తాతా సందీప్ శర్మ సంఖ్యాదర్శనము, నర్తకఋషి డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ అంత్యాక్షరి, తెలుగు పండిట్ దువ్వూరి మల్లికార్జున రావు వ్యస్తాక్షరి, డాక్టర్ బీహెచ్ వి రమాదేవి అఖండపఠనం, దేవవరపు నీలకంఠ రావు విలోమపఠనం, విద్యా విశారద డాక్టర్ అద్దేపల్లి సుగుణ అక్షర దర్శనం, తెలుగు పండిట్ ఎం వెంకటలక్ష్మిఅప్రస్తుత ప్రసంగంతో పృచ్ఛకులుగా వ్యవహరించి శర శస్త్రాలు సాధించగా, అవధాని ఉమామహేశ్వరరావు తనదైన శైలిలో ఎదుర్కొంటూ, ఆద్యంతం రక్తికట్టించారు. భగవద్గీత 18అధ్యయాలు మానవ నడవడిక ఎలా ఉండాలో వివరిస్తామని అవధాని పేర్కొన్నారు. శారీరక, వాచక, మానసిక తపస్సులు సక్రమంగా ఆచరిస్తే, అదే మనం భగవంతునికి ఇచ్చే కానుకగా పేర్కొన్నారు. అన్ని పచ్చళ్ళు అన్నంలో కలుపుకుంటాం కానీ, ఉగాది పచ్చడి ఎందుకు కలుపుకోమని అప్రస్తుత ప్రసంగంలో వెంకట లక్ష్మి అడిగిన ప్రశ్నకు అవధాని బదులిస్తూ, పచ్చళ్ళను అన్నంలో కలుపుకోవడంతో పాటు, నంజుకోవడం కూడా చేస్తామని అలా చేయకపోవడం వల్లనే ఉగాది పచ్చడి ప్రత్యేకత అని చమత్కరించారు. ఒకప్పుడు ‘పవిత్ర బంధం, ఉమ్మడి కుటుంబం ..’వంటి పేర్లతో సినిమాలు వచ్చేవని, అయితే ఇప్పుడు ‘ఉంటె ఉండు, పొతే పో ..’ వంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయని అడగ్గా, .. అప్పుడు తగ్గి ఉండేవారని, అందుకే మంచి పేర్లతో సినిమాలు వచ్చేవని, ఇప్పుడు తగ్గేదేలే అంటున్నారని అందుకు తగ్గట్టుగానే సినిమా పేర్లు ఉంటున్నాయని అవధాని వివరించారు. అవధానం అనంతరం కవులకు, గౌతమఘాట్ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులకు సత్కారం చేసారు. డా గోలి వెంకట రామారావు, డా జి నాగేశ్వరరావు దంపతులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పీఠం శాఖ అధ్యక్షులు ఎం ఆర్ కె రాజు, కార్యదర్శి డి కృష్ణంరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వనపర్తి సత్యనారాయణ, మెంబర్స్ శేఖర్, కలికి మూర్తి ఏర్పాట్లు పర్యవేక్షించారు. పివిఎస్ కృష్ణారావు, తోట సుబ్బారావు, సవితాల చక్రభాస్కరరావు, డా పివిబి సంజీవరావు, తరపట్ల సత్యనారాయణ, పలువురు సాహితీ ప్రియులు, పీఠం భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు తూర్పుగోదావరి జిల్లా పత్రిక మొదటి పేజీ

ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరి జిల్లా పత్రిక మొదటి పేజీ

ఆంధ్రప్రభ పత్రిక

జిల్లావార్త పత్రిక

న్యూస్ 99 పత్రిక

You may also like...