Tatvika Balavikas – Day1 updates
మనలో ఉన్న ఆనందాన్ని అన్వేషణ కొరకు ఇంద్రియాల ద్వారా తెలుసుకోండి అని శ్రీ కృష్ణానంద అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణా శిబిరాన్ని ఉమర్ ఆలీషా స్కూల్ కరస్పాండెంట్ శ్రీ హుస్సేన్ షా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గొప్పదైన మన భారతీయ సంస్కృతి ద్వారా తల్లి మొదటి గురువుగా భావించాలని, తాత్త్విక బాలవికాస్ ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అని శ్రీ హుస్సేన్ షా అన్నారు.
తాత్త్విక బాల వికాస్ ప్రధాన కన్వీనర్ శ్రీ ఏవివి. సత్యనారాయణ మాట్లాడుతూ 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన పండితులు ఈ 8 రోజులు పిల్లలకు శిక్షణ ఇస్తారు. క్రమశిక్షణతో వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొని మీ నైపుణ్యాలను పెంపొందించు కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ అద్వైత ఆశ్రమం వేదాంత ఆచార్య స్వామి శ్రీ కృష్ణానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రీ కృష్ణానంద మాట్లాడుతూ మీరందరూ అనంతమైన విద్యానిధికి వారసులు అని అన్నారు. పుట్టినది మొదలు చనిపోయే వరకూ నేర్చుకొనేవాడే యథార్థమైన నిత్య విద్యార్థి అని అన్నారు.
పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా స్వామివారు అంతర్జాలం ద్వారా అనుగ్రహ భాషణ, శుభాశీస్సులు ప్రసాదించారు. ఆహ్లాదకరమైన, దివ్య శక్తి గల మన నూతన ఆశ్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ ఏ.వి.వి. సత్యనారాయణగారి సారథ్యంలో పిల్లలు చదువులో రాణించడమే కాక, నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశీర్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో యోగ భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. జ్యోతుల నాగేశ్వరరావుగారు యోగా విశిష్టత, అష్టాంగ యోగం ప్రాముఖ్యత, ధ్యానం ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ శ్రీ కె.వి.ఎస్.ఎస్. ప్రసాద్ గారు, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ ఎన్.టి.వి. ప్రసాద వర్మ గారు వేదికపై ఆసీనులై ప్రసంగించారు. గీతావధాని, అవధాన కళాధర శ్రీ యర్రంశెట్టి ఉమా మహేశ్వర రావు సమన్వయ కర్తగా వ్యవహరించి, వందన సమర్పణ చేశారు.