తెలుగుభేరి పుస్తకావిష్కరణ | 04 September 2023

సోమవారం సెప్టెంబర్ 4 వ తేదీన సాయంత్రం 5 గం.లకు గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారు విశాఖపట్నం లోని కృష్ణ మందిర్ స్కూల్, కృష్ణానగర్, బివికె కాలేజ్ దరి లో ఉన్న పౌర గ్రంధాలయం లో తెలుగుభేరి పుస్తకావిష్కరణ జరిగినది.

భాష, సంస్కృతుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

  • జన్మభూమి, కన్నతల్లి, మాతృభూమి, మాతృభాషే మన అస్తిత్వం
  • మాతృభాషలో చదువు ఆత్మ గౌరవపు గుర్తింపు
  • మాతృభాషలో బోధనకు జాతీయ విద్యావిధానం – 2020 పెద్ద పీట వేయటం ఆనందదాయకం
  • తెలుగు దండు రూపకల్పన చేసిన “తెలుగు భేరి” పుస్తకాన్ని ఆవిష్కరించిన పూర్వ ఉపరాష్ట్రపతి
  • తెలుగు భేరి లాంటి సంకలనాలు తెలుగు జాతి సంపద
  • తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం తెలుగు దండు చేస్తున్న కృషి ముదావహం
  • తెలుగు భాషను కాపాడుకునేందుకు శ్రీ పరవస్తు చిన్నయ సూరి గారి వారసులు చేస్తున్న కృషి అభినందనీయం
  • తల్లి భాషలో మనదైన హృదం, తెలుగు పద్యంలో సాహిత్య ఔన్నత్యం ఉన్నాయి

విశాఖపట్నం, 4 సెప్టెంబర్ 2023

భాష, సంస్కృతుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలుగు జాతి సంపద అయిన సాహిత్యాన్ని కాపాడుకునేందుకు తెలుగు వారంతా కృషి చేయాలని గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయడు పిలుపునిచ్చారు. మాతృభాషలో చదువుకోవటం మన ఆత్మగౌరవానికి లభించే గుర్తింపుగా అభివర్ణించిన ఆయన, జాతీయ విద్యావిధానం – 2020 విద్యాబోధనలో మాతృభాషకు పెద్ద పీట వేయటం ఆనందదాయకమని తెలిపారు. తల్లిదండ్రులు, గురువులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ముందు తరాలకు మాతృభాషలోని మాధుర్యాన్ని అందించి, వారికి భాష పట్ల అనురక్తి పెంపొందించాలని అభిలషించారు. తెలుగు దండు రూపకల్పన చేసిన తెలుగు భేరి పుస్తకాన్ని విశాఖపట్నం ద్వారక నగర్ లో ఉన్న విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన ఆవిష్కరించారు. చొరవ తీసుకుని తెలుగు దండు చక్కని పుస్తకాన్ని సంకలనం చేసి ప్రజలకు అందించటం పట్ల అభినందనలు తెలియజేసిన ఆయన, ఇలాంటి పుస్తకాలు జాతి సంపద అని తెలిపారు. నా జాతి… నా భాష.. నా దేశం అనే నినాదంతో తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకునేందుకు ముందుకు రావటం పట్ల తెలుగు దండు వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక కేంద్ర పీఠాధిపతి డా. ఉమర్ అలీషా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం పూర్వ సంచాలకులు శ్రీ సి.ఆర్.కె. ప్రసాద్, పరవస్తు పద్యపీఠం గౌరవ అధ్యక్షులు శ్రీ సూరపనేని విజయకుమార్, తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు ఫణిశయనసూరి సహా పలువురు తెలుగు భాషాభిమానులు, సాహితీ వేత్తలు, కళాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమి, కన్నతల్లి, మాతృభూమి, మాతృభాషే మన అస్తిత్వమన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాబోవు తరాలకు మన ఘనమైన వారసత్వాన్ని అందించే మార్గం మన సాహిత్యమేనని పేర్కొన్నారు. భాష అంటే మాట్లాడుకునే మాటలే కాదని, అందులో మాధుర్యాన్ని సాహిత్యం రూపంలో ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని సూచించారు. పెద్దలు వీలు నామా రాయనవసరం లేకుండా మనకు సంక్రమించిన ఆస్తి తెలుగు పద్యమన్న ఆయన, తల్లిభాషలో మనదైన హృదయం, తెలుగు పద్యంలో సాహిత్య ఔన్నత్యం ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకునేందుకు తెలుగు వ్యాకరణకర్త శ్రీ పరవస్తు చిన్నయసూరి వారసులు ముందుకు రావటం అభినందనీయమన్న ఆయన, వారసత్వంలోని అర్థం అదేనని, ఆస్తులు పంచుకోవటం వారసత్వం అనిపించుకోదని, పెద్దల జవసత్వాలను అందిపుచ్చుకుని సమాజ అభ్యున్నతి కోసం కృషి చేయటమే వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందించే మార్గమని సూచించారు.

నిజమైన భావ వ్యక్తీకరణ మాతృభాష వల్లనే వస్తుందన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, మహాత్మ గాంధీ, రవీంద్రుని వంటి మహనీయులు మాతృభాష గొప్పతనాన్ని చాటి చెప్పారని పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం – 2020 ప్రాథమిక స్థాయిలో మాతృభాషకు పెద్ద పీట వేసిందని, అయితే ఉన్నత విద్యాబోధనలో ఈ స్ఫూర్తి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కారణంగా దేశంలో అధిక శాతం ప్రజలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఇది సామాజిక – సాంస్కృతిక మూలాధారం లేని స్థితికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే, ఆంగ్లమే మేధో ఔన్నత్యానికి కొలమానమనే ఓ అపోహ ముందు తరాల్లో నాటుకుపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

మాతృభాషను కాపాడుకునేందుకు భాషా సంస్థలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన, తెలుగు భేరి పుస్తకాన్ని తెలుగు దండు రూపొందించటం, ప్రచురణకు శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం ప్రచురించటం ఓ చక్కని ముందడుగు అని పేర్కొన్నారు. ఇదే ప్రేరణతో మరిన్ని సంస్థలు ముందు వచ్చి, మన భాషా సంస్కృతులను ప్రోత్సహించుకోవటం మీద దృష్టి పెట్టాలని సూచించారు. పుస్తకాల ప్రచురణ మాత్రమే కాకుండా, తెలుగు భాషను ప్రోత్సహించే మరిన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారు మాట్లాడుతూ, మానవ ప్రగతిలో భాష కీలక పాత్ర పోషిస్తుందని, మాతృభాషలో విద్యాబోధన లేనప్పుడు మనవైన విలువలు, వ్యక్తిత్వ వికాసం, మేధాపరమైన ప్రగతి మందగిస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యువతకు మనదైన మాతృభాషలోని మాధుర్యాన్ని పరిచయం చేసేందుకు తెలుగు దండు ద్వారా పరవస్తు ఫణిశయన సూరి గారు తెలుగు భేరి పుస్తకాన్ని రూపొందించటం అభినందనీయమని తెలిపారు.

విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత డా. సూరపనేని విజయకుమార్ గారు మాట్లాడుతూ, ఈరోజుల్లో చాటింపు లేనిదే పాటింపు రావటం లేదని, ఈ నేపథ్యంలో తెలుగు దండు లాంటి సంస్థలు తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమ స్థాయిలో కృషి చేయటం అభినందనీయమని తెలిపారు. పరభాషలను నేర్వటం అవసరమేనన్న ఆయన, అదే సమయంలో మనదైన మాతృభాషను శిరోధార్యంగా భావించాలని పేర్కొన్నారు. భాషా సంస్కృతులు, జాతికి జీవనదులన్న ఆయన, తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇంట్లో మాతృభాషలో మాట్లాడే విధంగా యువతను ప్రోత్సహించాలని కోరారు.

తెలుగు దండు, పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పరవస్తు పణిశయనసూరి మాట్లాడుతూ, తెలుగు భేరి పుస్తకం ఓ చారిత్రక అవసరమని పేర్కొన్నారు. యువతకు మాతృభాష, సంస్కృతులను మళ్ళీ చేరువ చేయటానికి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు రావటం విచారకరమన్న ఆయన, ఈ పుస్తక రూపకల్పనలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తొలి అడుగు మాత్రమే అని, తెలుగు బాషను యువతకు చేరువ చేసేందుకు తొలి ప్రయత్నంగా లక్ష తెలుగు భేరి పుస్తకాలను ఉచితంగా వితరణ చేయనున్నట్లు ప్రకటించారు.



You may also like...